ఏప్రిల్ 14న డా.అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ ఖరారు

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తైన డా.అంబేడ్కర్‌  విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి రోజున జరుగబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు భౌద్ద సాధువుల ప్రత్యేక పూజలతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డా.అంబేడ్కర్‌ మునిమనుమడు ప్రకాష్ అంబేడ్కర్‌ ముఖ్య అతిధిగా హాజరవుతారు. ఈ విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రాంవంజీ సుతార్‌ (98)ను ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ఘనంగా సన్మానించనున్నారు.   

సచివాలయ అధికారులు, సిబ్బంది, అన్ని శాఖల అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవ్వాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. అలాగే ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మంది దళితులు చొప్పున 119 నియోజకవర్గాల నుంచి 35,700 మందిని తీసుకురావాలని అధికారులకు సూచించారు. 

విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముందుగా సిఎస్ శాంతికుమారి ప్రారంభోపన్యాసం చేస్తారు. తర్వాత మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్య అతిధి ప్రకాష్ అంబేడ్కర్‌ ప్రసంగిస్తారు. చివరిగా సిఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. 

యావత్ దేశప్రజలు గుర్తించి గర్వపడేలా డా.అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు.