తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీకేజ్ జాతరసాగుతోంది

నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలలో తొలిరోజునే ప్రశ్నాపత్రం లీక్ అవడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తనదైన శైలిలో స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు, పరీక్షల జాతర కాదు... ప్రశ్నాపత్రాల లీకేజీ జాతర జరుగుతోంది. కానీ వీటికి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ బాధ్యత వహించడం లేదు. టిఎస్‌పీఎస్సీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ని రాజీనామా చేయాలని మేము డిమాండ్‌ చేస్తే, నాకే వందకోట్ల పరువునష్టం దావా నోటీసు పంపించారు. ఇప్పుడు పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము. మరి ఇప్పుడేం చేస్తారో? అని అన్నారు. 

పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అవడంపై ట్విట్టర్‌లో స్పందిస్తూ, “తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రం లికేజీ కావడం అత్యంత దురదృష్టకరం. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొంది. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోంది. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటు. ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారింది. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. పేపర్ లికేజి కి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. ఈ లికేజ్ ఘటనతో విద్యార్థుల్లో గంధరగోళం నెలకొంది. మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ లికేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దు. బాద్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి,” అని బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు.

దీనిపై వికారాబాద్ ఎస్పీ మురళీ వెంటనే స్పందిస్తూ, 10వ తరగతి పేపర్ ఎక్కడా లీక్ కాలేదు. ఎగ్జామ్ హాల్లో ఉన్న సైన్స్ టీచర్ బండప్ప 10వ తరగతి పేపర్‌ను వాట్సప్ ద్వారా ఒక మీడియా వాట్సప్ గ్రూప్లో 9.37గంటలకు షేర్ చేసాడు. అప్పటికే విద్యార్థుల అందరూ పరీక్ష హాల్లో ఉన్నారు,” అని జవాబిచ్చారు.