మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ విస్తరించాలనే కేసీఆర్ ప్రయత్నాలు మెల్లగా ఫలిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో రాజకీయ పార్టీల నేతలు ఎవరూ బిఆర్ఎస్లో చేరేందుకు క్యూ కట్టడం లేదు కానీ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు వచ్చి చేరుతున్నారు. శనివారం మహారాష్ట్ర నుంచి రైతు సంఘాల నేతలు శరత్ జోషి, ప్రణీత్ జోషి తదితరులు ప్రగతి భవన్కు వచ్చి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇంతకు ముందు నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడాను. తర్వాత నా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పోరాడాను. ఇప్పుడు రైతుల కోసం పోరాడుతున్నాను. నా జీవితం అంతా పోరాటలతోనే సాగిపోతోంది. అందుకు నేను బాధపడటం లేదు. తెలంగాణ కోసం పోరాడి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలిగాను. అలాగే రైతుల కోసం పోరాడుతూ దేశంలో రైతులందరి జీవితాలలో మార్పు తేగలిగితే నాకు అంతే చాలు. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవడం గమనిస్తే రైతులు తలుచుకొని పోరాటం మొదలుపెడితే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో అర్దం అవుతుంది. కనుక తెలంగాణలో రైతులు బాగుపడిన్నట్లే దేశంలో రైతులందరూ బాగుపడాలంటే అందరం కలిసికట్టుగా పోరాడక తప్పదు,” అని అన్నారు.