టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం టిఎస్‌పీఎస్సీ కార్యదర్శి, అనితా రామచంద్రన్ (ఐఏఎస్)కు సెక్షన్ 160 కింద నోటీసు పంపింది. శనివారం హైదరాబాద్‌లో తమ కార్యాలయంలో ఈ కేసుకు సంబందించి విచారణకు హాజరవ్వాలని దానిలో పేర్కొంది.
ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మొదట ఆమె పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్‌తోనే మొదలయ్యింది. టిఎస్‌పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌తో కలిసి కంప్యూటర్లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను దొంగిలించి అమ్ముకొన్నారు. కనుక దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు నేడు అనితా రామచంద్రన్‌ను ఈ వ్యవహారం గురించి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. గ్రూప్-1 పరీక్షలలో 100కి పైగా మార్కులు సాధించినవారిని కూడా ప్రశ్నించి, వారికి మళ్ళీ పరీక్ష పెట్టించి వారికి అన్ని మార్కులు సాధించగల ప్రతిభా ఉందా లేక వారిలో ఎవరికైనా ప్రశ్నాపత్రాలు అందాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సిట్ విచారణ వేగంగా సాగుతుంటే, మరోపక్క ప్రభుత్వం చిన్న చిన్న ఉద్యోగులను బలి ఇచ్చి పెద్దలను దీని నుంచి కాపాడాలని చూస్తోందని కనుక సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ చేత దర్యాప్తు చేయిస్తే తప్ప అసలు దోషులు బయటపడరని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.