నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళు ఏవీ?

ఇంతకాలం రాజకీయ పార్టీలు తమ నేతలకు స్వాగతం చెప్పేందుకు లేదా తమ సభలు సమావేశాల గురించి చాటింపు వేసుకొనేందుకు మాత్రమే ఫ్లెక్సీ బ్యానర్లు పెడుతుండేవి. కానీ బిఆర్ఎస్ పుణ్యమాని ఇప్పుడు పరస్పరం విమర్శించుకోవడానికి, ఆరోపణలు చేసుకోవడానికి కూడాఫ్లెక్సీ బ్యానర్లు పెడుతుండటంతో తెలంగాణలో ఫ్లెక్సీ బ్యానర్ల బిజినెస్ మూడు పోస్టర్లు ఆరు బ్యానర్లు అన్నట్లు సాగిపోతోంది. 

ఇటీవల నిజామాబాద్‌లో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా కొందరు “ఇదే మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు” అంటూ పసుపు రంగులో ఉన్న ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టారు. వాటిని బిఆర్ఎస్‌కు చెందినవారే పెట్టించారనేది అందరికీ తెలిసిన రహస్యమే. కనుక వెంటనే బిజెపికి చెందినవారు కూడా పోటీగా వాటి పక్కనే ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించారు. వాటిలో “కేసీఆర్‌ మాట ఇస్తే తప్పడు... తప్పితే తల నరుక్కొంటాడు...” అని వ్రాసి నిరుద్యోగ భృతి హామీ ఏమైంది? డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళ హామీ ఏమైయింది?రైతులకు ఉచిత ఎరువులిస్తామన్నారు ఏమైంది?నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు ఏమైంది? అంటూ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన పలు హామీల జాబితా పెట్టారు. వీటితో బిఆర్ఎస్‌, బిజెపిలు రాజకీయంగా ఏమి సాధిస్తాయో తెలీదు కానీ రెండు పార్టీలు కూడా తమను మభ్యపెడుతున్నాయనే విషయం ప్రజలకు అర్దం అవుతోందని చెప్పవచ్చు.