నేడు భద్రాచలంలో జరుగబోయే శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొనబోతున్నారు. ఆమె నిన్న సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో కొత్తగూడెంకు బయలుదేరివెళ్లారు. కొత్తగూడెం నుంచి ఆమె రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకొంటారు. ముందు భద్రాచలం ఆలయంలోని శ్రీసీతారాములవారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేస్తారు. తర్వాత ఆలయం సమీపంలో మిధిలా స్టేడియంలో జరుగబోయేశ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటారు.
గవర్నర్ పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం హెలికాఫ్టర్ ఇవ్వడం లేదు కనుక ఆమె రైల్లో భద్రాచలం ప్రయాణమయ్యారు. గత ఏడాది కూడా ఇదేవిదంగా రైల్లో భద్రాచలం చేరుకొని శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి స్వాగతం పలకాల్సి ఉండగా దానినీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎస్పీ లేదా దిగువస్థాయి అధికారులు మొక్కుబడిగా వచ్చి పలకరిస్తుంటారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయినా హైదరాబాద్ నగరానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి మొహం చాటేస్తున్నప్పుడు గవర్నర్‌కు మర్యాదలు లభిస్తాయనుకోవడం అత్యాసే అవుతుంది కదా! శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్ళీ మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ తిరిగివెళతారు.