16.jpg)
టిఎస్‌పీఎస్సీ స్కామ్‌లో తనపై అసత్య ఆరోపణలు చేసినందుకుగాను రూ.100 కోట్ల పరువు నష్టం దావాకు సిద్దం కావాలంటూ మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసుపై బండి సంజయ్ స్పందించారు.
హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కేటీఆర్ ఉడత ఊపులకు నేను భయపడేది లేదు. కేటీఆర్ పరువు ఖరీదు రూ.100 కోట్లు అయితే, టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది కదా... ప్రభుత్వం వాళ్ళకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తుందో కేటీఆరే చెప్పాలి. ఇందుకుగాను ఒక్కో నిరుద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనిపై మీరు ఎందుకు మాట్లాడరు? కేటీఆర్ నాకు నోటీస్ పంపడం కాదు... ముందు మిమ్మల్ని ప్రభుత్వం నుంచి బర్త్ రఫ్ చేసేంతవరకు మా పోరాటం ఆగదు.
బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులో తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఇద్దరూ బేషరతుగా బహిరంగంగా తనకు వారం రోజులలోగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని కోరారు. బండి సంజయ్ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి ఇంకా స్పందించవలసి ఉంది.