ఇటీవలే బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జానకీపురం మహిళా సర్పంచ్ నవ్యను లైంగికంగా వేధించిన ఘటన సద్దుమణిగేలోగా అటువంటిదే మరో ఘటన బయటపడింది. ఈసారి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై స్థానికంగా ఓ ఆరిజన్ డెయిరీ నిర్వహిస్తున్న శైలజ అనే మహిళ ఫిర్యాదు చేశారు.
మీడియాకు విడుదల చేసిన తాజా ఆడియోలో ఆమె ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను బెల్లంపల్లిలో ఓ డెయిరీ పెట్టుకొందామని ఎమ్మెల్యేని కలవగా ఆయన దానిలో వాటాదారునిగా చేరుతానని చెప్పి తన వాటాగా 2 ఎకరాల స్థలం ఇచ్చారని, ఇటీవలే దానిలో అన్ని ఏర్పాట్లు చేసుకొని భూమిపూజ చేశానని ఆమె చెప్పారు.
ఆయన తన డెయిరీ బిజినెస్లో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నారు కనుక కొన్నిసార్లు తాను ఆయనతో బిజినెస్ మీటింగ్స్ లో పాల్గొన్నానని చెప్పారు. ఓసారి తనతో వచ్చిన మరో అమ్మాయిని చూసి ఆమెను రాత్రికి తన వద్దకు పంపాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఒత్తిడి చేశారని ఆ మహిళ మీడియాకు విడుదల చేసిన ఆ ఆడియోలో ఆరోపించారు. కానీ తాను అందుకు అంగీకరించలేదు కానీ ఆ తర్వాత బ్రోకర్స్ ద్వారా వేరే అమ్మాయిలను పంపించానని చెప్పారు.
ఆ తర్వాత ఓసారి దళిత బంధు ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యే తన కార్యాలయానికి పిలిస్తే వెళ్ళానని అప్పుడు ఎమ్మెల్యే తనను మద్యం తాగమని ఒత్తిడి చేయగా తాను నిరాకరించి వచ్చేశానని చెప్పారు. మరోసారి ఆవిదంగా చేయనని హామీ ఇస్తే తాను మళ్ళీ ఆయన ఇంటికి వెళితే, అక్కడ సిద్దంగా ఉన్న పోలీసులు తనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు పట్టుకుపోయి, తనపై తప్పుడు కేసులు బనాయించి, మూడు రోజులు తనకు నరకం చూపారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాను జరిగిందంతా పోలీసులకు చెపుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, ఎమ్మెల్యేతో మాట్లాడుకొని సెటిల్ చేసుకోమని సలహా ఇచ్చారని ఆమె ఆరోపించారు.
తాను బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పటి నుంచి సంతోష్, పోచన్న, శ్రీపతి అనే ముగ్గురు ఎమ్మెల్యే అనుచరులు తనను వేధిస్తూనే ఉన్నారని ఆ మహిళా ఆవేదన వ్యక్తం చేశారు. వారి వలన తన ప్రాణానికి ప్రమాదం ఉందని చెపుతున్నా పోలీసులు తన పిర్యాదును నమోదు చేసుకోవడం లేదని ఆ మహిళా ఆరోపించారు. తాను బయటకు రాగానే పోలీసులు మళ్ళీ తనపై మరో తప్పుడు కేసు బనాయించారని ఆమె ఆరోపించారు. తాను ఎటువంటి తప్పు, నేరమూ చేయలేదని కానీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఒత్తిడి కారణంగా పోలీసులు కూడా తనను ఈవిదంగా వేధిస్తున్నారని ఆ మహిళ మీడియాకు విడుదల చేసిన ఆడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆమె ఆరోపణలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు. తన రాజకీయ ప్రత్యర్ధులు రాజకీయంగా తనను ఎదుర్కొనలేకనే ఈవిదంగా మహిళను అడ్డంపెట్టుకొని తనను దెబ్బకొట్టాలని చూస్తున్నారని అన్నారు.