ప్రధాని నరేంద్రమోడీ లేదా కేంద్రమంత్రులు హైదరాబాద్ పర్యటనకు వచ్చే ముందు వారిని విమర్శిస్తూ హైదరాబాద్ నగరంలో పోస్టర్స్ పెట్టడం సర్వసాధారణమైపోయింది. ప్రధాని నరేంద్రమోడీ ఏప్రిల్ 8వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించబోతున్నారు. హైదరాబాద్-తిరుపతి మద్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రారంభోత్సవం చేస్తారు.
ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఖరారైంది కనుక హైదరాబాద్‌లో మళ్ళీ మోడీకి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి. ఈసారి ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ స్థంభాలపై, అలాగే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్నిచోట్ల మోడీ ఫోటోతో ఈ పోస్టర్స్ ప్రత్యక్షమయ్యాయి. వాటిలో “మోడీగారు... ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు? ఈ పని ప్రారంభం: 2018, మే 5వ తేదీ. నేటికీ 5 ఏళ్ళు అయినా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు 40% కూడా పూర్తి కాలేదు,” అని వ్రాశారు.
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళేదారిలో సుమారు 6 కిమీ మేర ఉన్న ఈ ఎలివేటడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ పిల్లర్లపై ఈ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిని ఎవరు పెట్టారో తెలీదు కానీ పోలీసులు ఆ పోస్టర్స్ తొలగిస్తున్నారు.