
మాజీ మంత్రి, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. “నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. నా కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నేను అతనితో కలిసి మొన్న గాంధీ భవన్‌కు వెళ్లినప్పుడు, అక్కడ కాంగ్రెస్ నేతలు నాకు కూడా కండువా కప్పి పార్టీలో చేరిన్నట్లు చెప్పారు. కానీ నేను చేరలేదు. ఒకవేళ చేరానని వారు భావిస్తున్నట్లయితే నేను రాజీనామా లేఖను పంపిస్తాను,” అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ వ్రాశారు.
ఇదే విషయం ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియా ప్రతినిధులకు కూడా వివరించారు. ఇటీవలే తన భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కోలుకొన్నారని, కనుక ఆయన రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా ఉంటున్నారని తెలిపారు. కనుక కాంగ్రెస్ నేతలు ఆయన వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనను ఈ రాజకీయాలలోకి లాగే ప్రయత్నం చేయవద్దని అభ్యర్ధించారు.
డి.శ్రీనివాస్ మొదట కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మంత్రిగా, పిసిసి అధ్యక్షుడుగా పలు హోదాలలో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో రాష్ట్రంలో రాజకీయ మార్పులు జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పటి టిఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు.
కానీ ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బిజెపిలో చేరి గత లోక్‌సభ ఎన్నికలలో నిజామాబాద్ నుంచి పోటీ చేసి కల్వకుంట్ల కవితని ఓడించారు. కుమారుడిని గెలిపించుకొనేందుకు డిఎస్ తెర చాటున రాజకీయాలు చేశారని, ఆ కారణంగానే కల్వకుంట్ల కవిత ఓడిపోయారనే ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత కల్వకుంట్ల కవితతో సహా నిజామాబాద్‌లో టిఆర్ఎస్ నేతలు డిఎస్‌ను పార్టీలో నుంచి బహిష్కరించాలని కోరుతూ లేఖ వ్రాశారు.
అప్పుడు డిఎస్ కేసీఆర్‌ని కలిసి వివరణ ఇచ్చుకోవాలని ప్రయత్నించారు. కానీ కేసీఆర్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, పార్టీలో నుంచి బహిష్కరించకుండా పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి డిస్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి కానీ ఆయన చేరలేదు. ఇప్పుడు చేరకపోయినా చేరిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తుండటం విశేషం.