ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు


రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం సాయంత్రం ఎల్బీ నగర్ వద్ద హయత్ నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్ళే ఫ్లైఓవర్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇదివరకే ఎడమవైపు ఫ్లైఓవర్‌, రెండు అండర్ పాసులు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాము. ఇప్పుడు రెండోవైపు ఫ్లైఓవర్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎల్బీనగర్ చౌరస్తా సిగ్నల్ ఫ్రీగా మారింది. ఎస్ఆర్‌డిపిలో ఇది 35వ ప్రాజెక్టు. దీనిని రూ.32 కోట్లతో నిర్మించాము. ఒక్క ఎల్బీ నగర్లోనే 12 ప్రాజెక్టులు చేపట్టాము. వాటిలో ఇప్పటికే 9 పూర్తి చేశాము. మిగిలిన మూడూ ఫ్లైఓవర్లను కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా పూర్తిచేస్తాము. ఇవి కాక మరో 12 ప్రాజెక్టులు వివిద దశలలో నిర్మాణంలో ఉన్నాయి. 

రాబోయే రోజుల్లో నాగోల్ మెట్రోను దిల్‌సుఖ్‌నగర్‌తో అనుసంధానం చేసి వచ్చే ఎన్నికల తర్వాత హయత్ నగర్‌ వరకు విస్తరిస్తాము. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కనుక ఎల్బీ నగర్ నుంచి నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకొనేలా మెట్రోని అనుసంధానం చేస్తాము. ఎల్బీ నగర్ చౌరస్తాకు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు శ్రీకాంతాచారి పేరు పెడతాము. త్వరలోనే దీనికి సంబందించి జీవో జారీ చేస్తాము,” అని చెప్పారు.