ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ, మరోవైపు టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతున్న సంగతి తెలిసిందే. కనుక ఈ సమయంలో బిఆర్ఎస్ జాతీయ రాజకీయాల గురించి ఆలోచించలేకపోవచ్చని అందరూ భావిస్తుంటే దీనికి ఇదే తగిన సమయమని సిఎం కేసీఆర్ భావించడం విశేషం.
ఈ నెల 26న మహారాష్ట్రలో ‘కాందార్ లోహ’ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నాహాలు చేస్తున్నారు. ఫిభ్రవరి 5వ తేదీన తెలంగాణ సరిహద్దు జిల్లాగా ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌లో కేసీఆర్ బహిరంగసభ నిర్వహించిన సంగతి తెలిసిందే. నాందేడ్‌కు సుమారు 35 కిమీ దూరంలో ఈ‘కాందార్ లోహ’ ఉంది. అక్కడ లక్షమందితో భారీ బహిరంగసభ నిర్వహించి సత్తా చాటుకోవాలని బిఆర్ఎస్ భావిస్తోంది. ఈ సభ ఏర్పాట్లు, జనసమీకరణ బాధ్యతను తెలంగాణ పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ జాతీయ కార్యదర్శి హిమాన్షు తివారీ, మహారాష్ట్ర బిఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదంలకు కేసీఆర్ అప్పగించారు.
ఈ సభకు మరింత గట్టిగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాలు, జరుగుతున్న అభివృద్ధిని తెలియజేస్తూ 20 ప్రచార వాహనాలను, మరో 16 డిజిటల్ స్క్రీన్స్ కలిగిన ప్రచార వాహనాలను మహారాష్ట్ర గ్రామాలలో తిప్పుతూ మరాఠీ ప్రజలను ఆకట్టుకొనేందుకు ఇప్పటికే జోరుగా ప్రచారం చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాల గురించి వీటి ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నట్లు సమాచారం.
ఈసారి మహారాష్ట్రలో నాందేడ్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, షోలాపూర్ పట్టణాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని భావిస్తోంది. కనుక ఈ బహిరంగసభలో భారీగా మరాఠీ నేతలను, కార్యకర్తలను చేర్చుకొనేందుకు బిఆర్ఎస్ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ సభ విజయవంతం చేసి మహారాష్ట్రలో పైన పేర్కొన్న ప్రాంతాలకు బిఆర్ఎస్‌ని విస్తరించాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు.