తీన్మార్ మల్లన్నను తక్షణం విడుదల చేయాలి: బండి సంజయ్

క్యూ న్యూస్ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నను మంగళవారం రాత్రి 9 గంటలకు ఫిర్జాదీగూడలో ఆయన కార్యాలయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. క్యూ న్యూస్ కార్యాలయంలో గల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వగైరా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మూడు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డికి చెందిన 20-25 మంది వ్యక్తులు కత్తులు, కర్రలతో క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తీన్మార్ మల్లన్న టీమ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి కార్యాలయాన్ని పరిశీలించి వెళ్ళారు. కనుక ఆయన కార్యాలయంపై దాడిచేసిన వారిని గుర్తించి పట్టుకోవలసిన పోలీసులు, ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్నను, ఆయన అనుచరుడు సుదర్శన్‌ను ఎందుకు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారో తెలీదు.

అయితే నిన్న రాత్రి వచ్చింది మఫ్టీలో ఉన్న పోలీసులు కారని మంత్రి మల్లారెడ్డి అనుచరులై ఉండవచ్చని తీన్మార్ మల్లన్న, సుదర్శన్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం వారే వచ్చి మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా వార్తలు వ్రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించి వెళ్ళారని, కనుక వారే కిడ్నాప్ చేసి ఉండవచ్చని మల్లన్న కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న మరో జర్నలిస్ట్ తెలంగాణ విఠల్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపిస్తున్నారు. వారిద్దరినీ తక్షణం బేషరతుగా విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం కేసీఆర్‌ ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని అన్నారు. బండి సంజయ్‌ నేరుగా సంబందిత పోలీస్ అధికారులకు ఫోన్‌ చేసి వారిద్దరినీ తక్షణం విడిచిపెట్టాలని కోరారు.