ఈరోజుకి ఈడీ విచారణ ముగిసింది... రేపు లేనట్లే!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ఈరోజుకి ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి ఒంటరిగా వెళ్ళిన కల్వకుంట్ల కవితను రాత్రి 8.30 గంటల వరకు ఈడీ అధికారులు ప్రశ్నించి విడిచిపెట్టారు. ఈరోజు విచారణ తర్వాత ఆమెను అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపించడంతో ఈడీ కార్యాలయం వద్దకు బిఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని ఆమె రాక కోసం ఎదురుచూస్తుండిపోయారు. ఎట్టకేలకు ఆమె బయటకు రావడంతో అందరూ హర్షధ్వానలతో ఆమెకు స్వాగతం పలికారు, కల్వకుంట్ల కవిత వారికి అభివాదం చేస్తూ కారులో తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్‌ నివాసానికి వెళ్ళిపోయారు. 

ఈరోజు ఉదయం ఆమె ఈడీ విచారణకు వెళ్ళేముందు గత మూడేళ్ళుగా తాను ఉపయోగించిన 10 పాత ఫోన్లను అందరికీ చూపించి తీసుకువెళ్లి ఈడీ అధికారులకు అందజేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు దొరక్కుండా తప్పించుకొనేందుకు ఆమె గత మూడేళ్ళలో 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. అది దురుదేశ్యంతో చేసిన ఆరోపణ అని నిరూపించేందుకు కల్వకుంట్ల కవిత తాను ఉపయోగించిన 10 పాత ఫోన్లను ఈడీకి అప్పగించారు.   

ఈరోజు ఈడీ నుంచి పిలుపు అందుకొని ఆమె డిఫెన్స్ లాయర్ సోమా భరత్‌ కుమార్‌ మరికొందరు ఈడీ కార్యాలయానికి వెళ్ళి ఈడీ అధికారులు కోరిన పత్రాలను సమర్పించారు. మళ్ళీ ఈ కేసులో ఆమెను ప్రశ్నించదలిస్తే, ఆమెకు బదులు ఆమె డిఫెన్స్ లాయర్ లేదా ప్రతినిధి హాజరయ్యేందుకు వీలుగా కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకొన్నట్లు సమాచారం. కనుక ఈడీ మళ్ళీ కవితను విచారణ కొరకు పిలువకపోవచ్చని భావించవచ్చు. కానీ దీనిపై ఈడీ స్పష్టత ఈయవలసి ఉంది.