బండి సంజయ్‌... ఆరోపణలు నిరూపించండి: సిట్

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్‌ బృందం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు నేడు నోటీస్ పంపారు. ఈ వ్యవహారంలో ఆయన చేసిన ఆరోపణలకు సంబందించి సాక్ష్యాధారాలతో ఈ నెల 24వ తేదీన తమ కార్యాలయంలో హాజరవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. 

జగిత్యాల జిల్లాలో కొందరు బిఆర్ఎస్ నేతల పిల్లలకు, వారి పరిచయస్తుల పిల్లలకు టిఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రశ్నాపత్రాలు అందిన్నట్లు తన వద్ద సమాచారం ఉందని, ఒకే ఊరులో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని, ప్రశ్నాపత్రాల లీకేజీ వలననే వారందరికీ మంచి మార్కులు వచ్చాయని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ కేసులో మంత్రి కేటీఆర్‌ ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని ఆరోపించారు. దీనికి కేటీఆర్‌ను బాధ్యుడిని చేస్తూ మంత్రి పదవిలో నుంచి తొలగించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తుని తాను నమ్మడం లేదని సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ చేత విచారణ జరిపించి నిందితులపై కటిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. 

కనుక ఈనెల24న సిట్‌కి కార్యాలయానికి వచ్చి తన ఆరోపణలను బలపరిచే ఆధారాలను సమర్పించి, వివరణ ఇవ్వాలని బండి సంజయ్‌ని సిట్ ఆదేశించింది. ఇంచుమించు ఇటువంటి ఆరోపణలే చేసిన రేవంత్‌ రెడ్డికి కూడా సిట్ నోటీస్ పంపి ఈ నెల 23న వచ్చి ఆధారాలను సమర్పించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే తనకు సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని, ఒకవేళ సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ చేత దర్యాప్తు చేయిస్తే తన వద్ద ఉన్న ఆధారాలను ఇస్తానని రేవంత్‌ రెడ్డి చెపుతున్నారు. కనుక ఇద్దరు ప్రతిపక్ష నాయకులు సిట్‌కి విచారణకు హాజరవుతారో లేదో సస్పెన్స్.