సిట్‌ నోటీస్ అందలేదు... అందినా ఆధారాలు ఇవ్వను!

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న తీవ్ర ఆరోపణలు చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి సిట్‌ అధికారులు నోటీస్ ఇచ్చి ఈ కేసుకి సంబందించి ఆయన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను సమర్పించవలసిందిగా కోరారు.

దీనిపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ, “ఈ కేసులో నిందితులను పట్టుకోవలసిన పోలీసులు నాకు నోటీస్ పంపించి సాక్ష్యాధారాలు కోరిన్నట్లు మీడియా వార్తల్లో ఇప్పుడే చూశాను. అయితే ఇంతవరకు నాకు సిట్‌ నుంచి నోటీస్ అందలేదు, ఒకవేళ అందినా నేను ఇటువంటి నోటీసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నా వద్ద ఉన్న సాక్ష్యాధారాలను సిట్‌కి ఇవ్వను. తెలంగాణ ప్రభుత్వం సిట్‌ని అడ్డం పెట్టుకొని ఈ కేసును అటకెక్కించేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు నా వద్ద ఉన్న సాక్ష్యాధారాలను సిట్‌కి ఎందుకు ఇవ్వాలి? సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తేనే ఇస్తాను. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువతతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. కనుక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు తెలంగాణ నిరుద్యోగ యువత కోసం నేను పోరాడుతూనే ఉంటాను,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతి చక్రం తిప్పి నిందితుడు రాజశేఖర్‌ని టిఎస్‌పీఎస్సీలోకి తీసుకువచ్చారని అతను జగిత్యాల మండలంలో కొంతమంది అభ్యర్ధులకు ప్రశ్నాపత్రాలు అమ్ముకొన్నాడని, ఆ మండలంలో 50 మందికి పైగా గ్రూప్-1 పరీక్షలు వ్రాయగా వారిలో చాలా మందికి 150కి 100కి పైగా మార్కులు వచ్చాయని ఆరోపించారు. కనుక దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలని, దీనికంతటికి మంత్రి కేటీఆర్‌ను బాధ్యుడు కనుక ఆయనను తక్షణం బర్త్ రఫ్ చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 

ప్రభుత్వంపై , మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌ రెడ్డి ఇంత తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు వాటిని నిరూపించవలసిన బాధ్యత ఆయనదే. కనుక సిట్‌కి సాక్ష్యాధారాలు ఇవ్వక తప్పదు. ఇవ్వకపోతే ప్రభుత్వంపై, మంత్రి కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్టకు భంగం కలిగించినందుకు రేవంత్‌ రెడ్డిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది.