రేవంత్‌ రెడ్డికి సిట్‌ నోటీసులు...ఆరోపణలకు ఆధారాలేవి?

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి షాక్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతి చక్రం తిప్పి నిందితుడు రాజశేఖర్‌ని టిఎస్‌పీఎస్సీలోకి తీసుకువచ్చారని, ఆ తర్వాత రాజశేఖర్ జగిత్యాల మండలంలో కొంతమంది అభ్యర్ధులకు ప్రశ్నాపత్రాలు అమ్ముకొన్నాడని, ఆ మండలంలో 50 మందికి పైగా గ్రూప్-1 పరీక్షలు వ్రాయగా వారిలో చాలా మందికి 150కి 100కి పైగా మార్కులు వచ్చాయని ఆరోపించారు. కనుక దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలని, దీనికంతటికి మంత్రి కేటీఆర్‌ను బాధ్యుడు కనుక ఆయనను తక్షణం బర్త్ రఫ్ చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 

ఈ ఆరోపణలను సిట్ బృందం పరిగణనలోకి తీసుకొని సోమవారం రేవంత్‌ రెడ్డికి నోటీస్ పంపింది. ఈ కేసులో చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలను తమకు సమర్పించాలని కోరింది. వాటి ఆధారంగా ఇంకా ఎవరెవరు ఈ వ్యవహారంలో ఉన్నారో కనుగొంటామని నోటీసులో పేర్కొంది. 

ఒకవేళ రేవంత్‌ రెడ్డి తన ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలను సమర్పించలేకపోతే, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు అప్పుడు ఆయనపైనే చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

ఈ వ్యవహారంపై నేడు హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఒకటి ఈ కేసులో నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత వేయడం విశేషం. ఈ కేసు విచారణ పేరుతో పోలీసులు తన భర్తను హింసించకుండా ఆదేశించాలని, విచారణ మొత్తం వీడియో రికార్డ్ చేసి కోర్టుకు సమర్పించాల్సిందిగా కోరారు. అలాగే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆమె కోరడం విశేషం. 

ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతి పాత్రపై దర్యాప్తు జరిపించాలని, ఈ కేసుపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ ఎన్‌ఎస్‌యుఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మార్చి 21న ఈ కేసు తదుపరి విచారణ జరుగనుంది.