టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం కామారెడ్డిజిల్లా గాంధారిలో ఒక్కరోజు నిరుద్యోగ దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ ‘తిరుపతి’ తెరవెనక నుండి మొత్తం కధ నడిపించాడు. ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన రాజశేఖర్, తిరుపతి పక్కపక్క ఊర్లకు చెందినవారు. అతని సిఫార్సు మేరకే రాజశేఖర్‌కు టిఎస్‌పీఎస్సీలోకి వచ్చాడు. ఆ తర్వాత తిరుపతి, రాజశేఖర్ కలిసి తమ మండలంలోని నిరుద్యోగులకు ఈ ప్రశ్నాపత్రాలు అమ్ముకొన్నారు. అందుకే వారి మండలంలో అభ్యర్ధులకే గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100కు పైగా మార్కులు వచ్చాయి. టిఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న 20 మంది కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు.
నిబందనల ప్రకారం వారు టిఎస్‌పీఎస్సీ పరీక్షలకు హాజరుకావాలంటే లాంగ్ లీవ్ తీసుకొని ఉండాలి లేదా వేరే శాఖకు బదిలీ చేయించుకొని ఉండాలి లేదా టిఎస్‌పీఎస్సీలో తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉండాలి. కానీ ఈ మూడు చేయకపోయినా ప్రభుత్వం వారికి ‘నో అబ్జక్షన్’ సర్టిఫికేట్’ ఎలా ఇచ్చింది?
కనుక ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద కుట్ర. అది సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు తెలిసే జరిగింది. కనుక వారి కనుసన్నలలో పనిచేసే సిట్ చేత దర్యాప్తు చేయించి నిజాలను దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో తమ హస్తం లేకపోతే సిఎం కేసీఆర్ తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించాలి లేకుంటే రేపు మేము హైకోర్టులో పిటిషన్ వేసి మా వద్ద ఉన్న ఈ సాక్ష్యాధారాలన్నిటినీ సమర్పించి సీబీఐ విచారణ జరిపించాలని కోరబోతున్నాము,” అంటూ రేవంత్ రెడ్డి అత్యధిక మార్కులతో పాస్ అయిన కొందరు అభ్యర్ధుల పేర్లు చదివి వినిపించారు.