
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన భర్త అనిల్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులతో కలిసి ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె ఈనెల 16న ఈడీ విచారణకు హాజరుకావలసి ఉండగా ఆరోగ్య కారణాలతో వెళ్ళలేదు కనుక నేడు విచారణకు హాజరుకావలసిందిగా ఈడీ ఆమెకు వెంటనే నోటీస్ పంపింది. అయితే ఈడీ విచారణపై అభ్యంతరాలు చెపుతూ ఆమె సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ జరుగనుంది. కనుక అంతవరకు ఈడీ విచారణకు హాజరుకాకూడదని భావించినప్పటికీ, ఢిల్లీలో ఈడీకి అందుబాటులో ఉండటం మంచిదనే న్యాయనిపుణుల సలహా మేరకు ఆమె నిన్న ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. కనుక ఈరోజు ఆమె ఈడీ విచారణకు హాజరవుతారా లేదా? ఒకవేళ ఈరోజు కూడా ఆమె విచారణకు హాజరుకాకపోతే ఈడీ ఏవిదంగా స్పందిస్తుంది?అనే ప్రశ్నలకు మరికొన్ని గంటలలో సమాధానాలు లభిస్తాయి.
నిబందనల మేరకు ఈడీ విచారణ జరగడం లేదంటూ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కనుక ఆ వాదన ప్రకారమే ఈడీకి అందుబాటులోనే ఉన్నానని కానీ విచారణకు హాజరుకాలేనని తన న్యాయవాది ద్వారా కబురు పంపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈడీ అందుకు అంగీకరించకపోతే విచారణకు హాజరవకతప్పకపోవచ్చు లేకుంటే ఆమె పిటిషన్‌పై ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టినప్పుడు, ఈడీ వాదనలకు బలం చేకూర్చిన్నట్లవుతుంది.