.jpg)
తెలంగాణ బిజెపి నేతలు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేతృత్వంలో శనివారం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, “నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే కొట్లాడి తెలంగాణ సాధించుకొన్నాము. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని గొప్పలు చెప్పుకొని పేపర్లతో తాటికాయంత అక్షరాలలో చాటింపు వేసుకొన్నారు. ఇదిగో..అదిగో... అంటూ మూడేళ్ళు కాలక్షేపం చేసిన తర్వాత ఉద్యోగాల భర్తీ కోసం నాలుగు పరీక్షలు నిర్వహిస్తే నాలుగు పేపర్లూ లీక్ అయ్యాయి. ఇక ముందు జరుగబోయేవి కూడా లీక్ అయ్యాయని చెపుతూ జరిగిన పరీక్షలను, జరుగబోయే పరీక్షలను అన్నిటినీ రద్దు చేశారు.
తెలంగాణలో 30 లక్షల నిరుద్యోగ యువత జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. పరీక్షలు రద్దుచేసి జరిగిన తప్పులను తుడిచేసుకోవాలనుకొంటున్నారు. కానీ ఈ పరీక్షల కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూస్తూ, గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి హాస్టల్స్ ఉంటూ, కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయల ఫీజులు చెల్లించిన నిరుద్యోగ యువతకి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు?గ్రామాలలో వ్యవసాయ కూలీలుగా లేదా ఆటో రిక్షాలు నడుపుకొని జీవనం సాగిస్తున్న వారి తల్లితండ్రులు తమా బిడ్డలైన మంచి ఉద్యోగాలు సంపాదించుకొని సుఖపడతారనే ఆశతో కడుపులు మాడ్చుకొని కూడబెట్టిన సొమ్ముని పిల్లలకిస్తున్నారు. ఆ తల్లితండ్రులు కష్టాన్ని ఎవరు తీరుస్తారు?ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వలన పరీక్షలన్నీ రద్దయితే వారికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు?
సిఎం కేసీఆర్‌కి తెలంగాణ బిడ్డలు, వారి తల్లితండ్రుల పట్ల ఏమాత్రం నిబద్దత లేదని ఇది రుజువు చేస్తోంది. ఈ వ్యవహారంతో తీవ్ర నిరాశా నిస్పృహలతో నవీన్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇది చాలా బాధాకరం. కనుక మేము రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకొని తల్లితండ్రులకు గర్భశోకం మిగల్చవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరి తరపున బిజెపి ప్రభుత్వంతో పోరాడి మెడలు వంచి ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను.
ఈ నిర్లక్ష్యానికి సిఎం కేసీఆర్, టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తో సహా బోర్డు సభ్యులు అందరూ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతున్నాను. అలాగే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నాను. ఈ పేపర్ లీక్ స్కామ్ వలన నష్టపోయిన విద్యార్దులందరికీ ఒక్కొక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, రద్దు చేసిన పరీక్షలన్నిటినీ వీలైయానంత త్వరగా నిర్వహించాలని బిజెపి తరపున డిమాండ్ చేస్తున్నాము,” అని ఈటల రాజేందర్ అన్నారు.