21.jpg)
టిఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి రాజకీయరంగు అంటుకోవడంతో అధికార, ప్రతిపక్షాల మద్య జోరుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ స్కామ్‌లో బిఆర్ఎస్ నేతల హస్తం ఉందని కనుక టిఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని పదవిలో నుంచి తొలగించి, సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.
రాష్ట్ర బిజెపి బండి సంజయ్ చేస్తున్న విమర్శలను, ఆరోపణలను మంత్రి కేటీఆర్ తిప్పికొడుతూ, బండి సంజయ్ ఓ రాజకీయ అజ్ఞాని... తెలివితక్కువ దదమ్మ అంటూ ఘాటుగా విమర్శించారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బండి సంజయ్‌కి ప్రభుత్వాలు, వాటిలో ఉండే పలు వ్యవస్థల పనితీరుపట్ల ఎటువంటి అవగాహన లేదు. టిఎస్పీఎస్సీ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాదు అదొక రాజ్యాంగబద్దమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనే విషయం కూడా బండి సంజయ్‌కి తెలియదు. అందుకే ఆ సంస్థలో ఒకరిద్దరు చేసిన తప్పులకి ప్రభుత్వాన్ని నిందిస్తూ, యువతని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు.
ఒక్క గుజరాత్‌లోనే 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. కనుక కేసీఆర్‌ని రాజీనామా చేయమని అడుగుతున్నట్లు ప్రధాని నరేంద్రమోడీని రాజీనామా చేయమని బండి సంజయ్ అడగగలరా?ఈ సమస్యని ఏదోవిదంగా పెద్దదిచేసి శాంతిభద్రతల సమస్యగా మార్చాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది. కానీ ఆయన ఆటలు సాగనీయము.
అసలు బిజెపియే ఈ కుట్ర చేసినట్లు ప్రాధమిక నివేదికలో తేలింది. కనుక ఒకవేళ బిజెపి పాత్ర ఉన్నట్లు తేలితే ఎవరినీ విడిచిపెట్టము. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడగానే ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులందరినీ అరెస్ట్ చేయించింది. ప్రశ్నాపత్రాల లీక్ కారణంగా ఎవరికీ అనుమానాలు, అపోహలు, టిఎస్పీఎస్సీకి, ప్రభుత్వానికి కూడా అపవాదురాకూడదనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించేందుకు సిద్దపడుతున్నాము.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొంటున్న అభ్యర్ధులందరూ త్వరలో జరుగబోయే పరీక్షలపైనే దృష్టి పెట్టి సిద్దం అవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాజకీయ కుట్రలలోచిక్కుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కేటీఆర్ అన్నారు.