ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత గురువారం మళ్ళీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉంది. కానీ ఆమె ఈరోజు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం మహిళలను వారి నివాసంలోనే ప్రశ్నించవలసి ఉండగా, ఈడీ అధికారులు తనను ఢిల్లీకి పిలిపించుకొని కార్యాలయంలో విచారిస్తుండటంపై కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నాలుగు రోజుల క్రితం విచారణకు రమ్మనమని పంపిన నోటీసులో మరికొందరితో కలిపి (ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులు రామచంద్ర అరుణ్ పిళ్ళై తదితరులు) తనను విచారిస్తామని చెప్పారని కానీ తనను ఒంటరిగా ప్రశ్నించారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. అలాగే ఈడీ కార్యాలయంలో తాను ప్రవేశించగానే అధికారులు తమ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొన్నారని కల్వకుంట్ల కవిత ఈ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకి తెలియజేశారు.
ఆమె పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలియజేసింది కానీ తక్షణం దీనిపై విచారణ చేపట్టలేమని చెప్పింది. దీనిపై మద్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణను మార్చి 24వ తేదీకి ఖరారు చేసింది.
కనుక కల్వకుంట్ల కవిత మళ్ళీ రేపు ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకాక తప్పదు. లేదా ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున మరో రోజున విచారణకు హాజరయ్యేందుకు గడువు పొందవచ్చు.