48 గంటల్లో టిఎస్‌పీఎస్సీ కేసు చేదించిన పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును బేగమ్ బజార్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టిఎస్‌పీఎస్సీ కార్యదర్శికి పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌తో సహా మొత్తం 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి ఉస్మానియా హాస్పిటల్లో వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితులను చంచల్‌గూడ జైలుకి తరలించారు. 

కోర్టుకు సమర్పించిన రిమాండ్‌పై రిపోర్టులో పోలీసులు పలు కీలకమైన విషయాలు పేర్కొన్నారు. తమ విచారణలో నిందితుడు ప్రవీణ్‌ డబ్బుకి ఆశపడి మిగిలిన నిందితులతో కలిసి ఈ నేరం చేసిన్నట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి ఏఈ ఉద్యోగాలకు సంబందించి 24 పేజీల పరీక్షా పత్రాల కాపీలను, టౌన్ ప్లానింగ్‌కు పరీక్షా పత్రాలకు సంబందించి 25 కాపీలను స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు. వాటిన్నటినీ మెయిన్ సర్వర్ నుంచే డౌన్‌లోడ్‌ చేసి, రేణుకకు షేర్ చేశాడు. ఆమె తన భర్త, సోదరుడు సాయంతో వాటిని ఒక్కో పేపర్ రూ.20 లక్షల చొప్పున అభ్యర్ధులకు అమ్మేందుకు ప్రయత్నించిందని రిమాండ్‌పై రిపోర్టులో పేర్కొన్నారు. తొమ్మిది మంది నిందితులను జైలుకి తరలించిన తర్వాత వారిని మరింత లోతుగా ప్రశ్నించేందుకు 10 రోజులు కస్టడీ ఇవ్వాలని బేగంబజార్ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ కేసు తదుపరి విచారణను సైబర్ క్రైమ్ (సిసిపి) పోలీసులకు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సిపి సీవీ ఆనంద్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్న సిట్‌ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌) ఈ కేసు విచారణ చేపడుతుంది.