బండి సంజయ్‌కి మహిళా కమీషన్‌ నోటీస్ జారీ

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి రాష్ట్ర మహిళా కమీషన్‌ శనివారం నోటీస్ జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నేడు ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్న కల్వకుంట్ల కవితని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సుమోటుగా  స్వీకరించి ఆయనను కమీషన్‌కు ఎదుట స్వయంగా హాజరయ్యి సంజాయిషీ ఇవ్వాలని నోటీస్ పంపింది. అక్కడ ఢిల్లీలోను, ఇక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా బండి సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ శ్రేణులు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నాయి. 

కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసు జారీ చేయడంతో ఆమెను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో బండి సంజయ్‌ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. దానిలో ఓ విలేఖరి “కవితను అరెస్ట్ చేయబోతున్నారా?” అని ప్రశ్నించగా, బండి సంజయ్‌ స్పందిస్తూ “ఏం అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకొంటారా?” అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఓ వివాహిత మహిళ పట్ల బండి సంజయ్‌ ఈవిదంగా అనుచితంగా మాట్లాడినందుకు వివరణ కోరుతూ మహిళా కమీషన్‌ నోటీస్ పంపింది. 

శనివారం ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ఈడీ కార్యాలయంలోకి ప్రవేశించారు. సాయంత్రం 4.30 గంటలు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతసేపు ప్రశ్నిస్తారో? విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదా?ఆమె బినామీ వ్యాపార భాగస్వామిగా పేర్కొంటున్న రామచంద్ర అరుణ్ పిళ్లైతో పాటు మరో 4 రోజులు ప్రశ్నిస్తారా? అనేది ఆమె బయటకు వస్తే తెలుస్తుంది. 

ఢిల్లీలో ఈడీ కార్యాలయం ఎదుట భారీగా బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కల్వకుంట్ల కవిత కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఆమెని అరెస్ట్ చేసిన్నట్లయితే, ఈ లిక్కర్ స్కామ్‌లోనే చిక్కుకొన్న ఢిల్లీలో అధికార ఆమాద్మీ పార్టీతో కలిసి బిఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.