కవితక్క కోసం... హైదరాబాద్‌లో పోస్టర్స్

సిఎం కేసీఆర్‌ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో శనివారం ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. ప్రస్తుతం ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.  తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్‌ నివాసం నుంచి 10 కార్లలో బిఆర్ఎస్ మంత్రులు, నేతలు వెంటరాగా భర్త అనిల్, న్యాయవాదులతో కలిసి కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయానికి చేరుకొన్నారు.

అప్పటికే ఈడీ కార్యాలయం వద్దకు వందలాదిమంది బిఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొన్నారు. కల్వకుంట్ల కవిత తాను ఈ పోరాటానికి సిద్దంగా ఉన్నానని వారికి తెలియజేస్తూ పిడికిలి బిగించి చూపిస్తూ, అభివాదం చేస్తూ ఈడీ కార్యాలయంలోకి ప్రవేశించారు. బిఆర్ఎస్ కార్యకర్తలు లోనికి చొచ్చుకు రాకుండా భారీగా పోలీసులను మోహరించి ఈడీ కార్యాలయం వద్ద బారికేడ్లు అమర్చారు.  

మంత్రులు శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, కేటీఆర్‌ తదితరులు శుక్రవారం రాత్రి న్యాయనిపుణులతో ఈ కేసుని ఏవిదంగా ఎదుర్కోవాలని సుదీర్గంగా చర్చించారు. ఢిల్లీలో కల్వకుంట్ల కవిత విచారణకు హాజరవుతుండటంతో ఇక్కడ హైదరాబాద్‌లో ప్రధాన కూడళ్ళలో కల్వకుంట్ల కవితకు మద్దతుగా, బైబై మోడీ అంటూ పోస్టర్లు వెలిశాయి. 

వివిద రాష్ట్రాలలో విపక్ష నేతలు ఇటువంటి కేసులకు భయపడి లొంగిపోయి, కాషాయరంగు పులుముకొని బిజెపిలో చేరిపోయిన్నట్లు చూపారు. పక్కనే కల్వకుంట్ల కవిత ఫోటోని వేసి ఆమెపై కేంద్ర ప్రభుత్వం ‘రెయిడ్స్’ అనే వాషింగ్ పౌడరుని ప్రయోగించినా రంగు మారలేదని చూపారు. సీబీఐ, ఈడీ రెయిడ్స్ చేయక మునుపు ఎలా ఉన్నారో చేసిన తర్వాత కూడా అలాగే స్థిరచిత్తంతో ధైర్యంగా ఉన్నట్లు చూపారు.