
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రేపు (గురువారం) విచారణకు హాజరుకావాలంటూ ఈడీ పంపిన నోటీసు తనకు అందిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధృవీకరించారు. అయితే ఈ కేసుతో తనకు ఏమీ తెలియదని, దీంతో తనకు ఎటువంటి సంబందమూ లేదన్నారు. కేంద్ర తన తండ్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నందున ఆయనను రాజకీయంగా లొంగదీసుకొనేందుకే, తనపై ఈ అక్రమ కేసు బనాయించి వేదిస్తోందని కల్వకుంట్ల కవిత అన్నారు.
ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందం లేనప్పటికీ చట్టాన్ని గౌరవించి ఇంతకు ముందు సీబీఐ అధికారులకు సహకరించానని, ఇప్పుడు ఈడీకి కూడా సహకరిస్తానని కల్వకుంట్ల కవిత చెప్పారు. అయితే రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ల కొరకు తాను నిరాహారదీక్షలో పాల్గొనబోతున్నందున, రేపు విచారణకు హాజరుకాలేనని, ఆ తర్వాత ఎప్పుడైనా తప్పక హాజరవుతానని కల్వకుంట్ల కవిత చెప్పారు.
ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేనప్పటికీ తనను అరెస్ట్ చేసి జైలుకి పంపించినా దానికీ తాను సిద్దంగానే ఉన్నానని, న్యాయపోరాటం చేసి తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొంటానని చెప్పారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు తాను 10 ఫోన్లు ధ్వంసం చేశానని సీబీఐ పేర్కొనడాన్ని కల్వకుంట్ల కవిత తప్పు పట్టారు. తన పాత ఫోన్లన్నీ భద్రంగా ఉన్నాయని కావాలంటే వాటిని సీబీఐ లేదా ఈడీకి ఇస్తానని చెప్పారు.
ఈ కేసులో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసేందుకే ఈడీ నోటీసులు జారీ చేసిందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తుండటంతో హైదరాబాద్‌లో ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.