అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, “అత్యున్నత హోదాలో ఉన్న నన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించకుండా అవమానిస్తూనే ఉంది. మహిళలని వేధించేవారికి, మాపై రాళ్ళు వేసినవారికి దండలు, సన్మానాలు చేస్తోంది. తద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తోంది? రాష్ట్రంలో ప్రధమ మహిళనైనా నాకే గౌరవం ఇవ్వలేనప్పుడు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో మహిళల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వేధింపులకు ఆడపిల్లలు బలవుతూనే ఉన్నారు. డాక్టర్ ప్రీతిని మనం కాపాడుకోలేకపోయాము. రాష్ట్రంలో ఎక్కడైనా ఓ మహిళకు అన్యాయం జరిగితే మిగిలిన మహిళలు అందరం ఆమెకు అండగా నిలబడి నీకు మేమున్నామని ధైర్యం చెపుదాం. గుర్తింపుకు నోచుకోని ప్రతిభావంతుల కోసం రాజ్‌భవన్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని మరిచిపోవద్దు,” అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.