ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఆరోజున మహిళా ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సాధారణ సెలవు దినంగా పరిగణిస్తున్నట్లు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళా దినోత్సవం సందర్భంగా అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సెర్ఫ్, మెప్మా మహిళలకు వడ్డీలేని రుణం అందజేయబోతున్నట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్లను కేటాయించిందని తెలిపారు.
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 మహిళా క్లినిక్స్ ప్రారంభించబోతున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తొలుత ప్రతీ మంగళవారం నడిచే వీటిలో మహిళలకు 57 రకాల ఉచిత వైద్య పరీక్షలు, వాటికి ఉచిత చికిత్సలతో పాటు అవసరమైన మందులు కూడా అందించబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బస్తీ దవఖానాలు, ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కు అనుబందంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యని 1200కి పెంచబోతున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.