విరూపాక్ష టీజర్‌ చూశారా... అదిరిపోయిందిగా!

విరూపాక్ష టీజర్‌ అంటే సాయి ధరం తేజ్, సంయుక్త నటించిన విరూపాక్ష సినిమా టీజర్‌ కాదు. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చెన్నగిరి బిజెపి ఎమ్మెల్యే మాడాళు విరూపాక్షప్ప కొడుకు వ్యవహారం గురించి అన్న మాట! కర్ణాటక ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జంట్స్ లిమిటెడ్‌ (కెఎస్‌డిఎల్‌)కు విరూపాక్ష ఛైర్మన్‌ కూడా. ఆయన కొడుకు ప్రశాంత్ కర్ణాటక జలమండలిలో చీఫ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.

కెఎస్‌డిఎల్‌ కంపెనీకి చాలా రకాల ముడి సరుకులు అవసరం ఉంటాయి. కనుక వాటికి ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంటుంది. ఓ గుత్తేదారుకి ఆ టెండర్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే విరూపాక్ష తరపున ఆయన కొడుకు ప్రశాంత్ బేరం పెట్టారు. టెండర్ దక్కాలంటే తనకి 80 లక్షలు లంచం ఇవ్వాలని గుత్తేదారుపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే అంత ఇచ్చుకోలేనంటూ అతను ఎంతగా బ్రతిమాలుకొన్నప్పటికీ ప్రశాంత్ తగ్గేదేలే అంటూ బిగుసుకొని కూర్చోన్నారు. 

దాంతో ఆ గుత్తేదారు లోకాయుక్తకి ఫిర్యాదు చేయగా, వారి సూచనల ప్రకారం ఓ బ్యాగులో 40 లక్షలు పెట్టుకొని తీసుకువెళ్ళి ప్రశాంత్‌ కార్యాలయానికి తీసుకువెళ్ళి ఇచ్చాడు. వాటిని ఆయన తీసుకొంటుండగా లోకాయుక్త అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండడ్‌గా పట్టుకొన్నారు. 

ఆ తర్వాత వారు ఆయనని వెంటబెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళి సోదాలు చేయగా అక్కడ వారికి రూ.6 కోట్లు నగదు కట్టలు లభించాయి. ఒక్కో బ్యాగులో రూ.1.7 కోట్లు చొప్పున మూడు బ్యాగుల్లో వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు. ఎమ్మెల్యే విరూపాక్ష కొడుకుని పట్టుకొంటే రూ.6 కోట్లు పట్టుబడ్డాయి. అదే ఎమ్మెల్యేని పట్టుకొంటే... అంటే ఇది విరూపాక్ష పూర్తి సినిమా చూడనే లేదు కనుక ఇది టీజర్‌ మాత్రమే అనుకోవాలేమో?కొడుకు పట్టుబడటంతో ఆయన కెఎస్‌డిఎల్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. అయినా ఎమ్మెల్యే పదవి ఉందిగా... అది చాలదూ?