కేసీఆర్‌ మనుమడైనా పాపం వేధింపులు తప్పడం లేదు!

తెలంగాణలో కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై వాలాలంటే ఈగ అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసిందే. అంత పటిష్టమైన భద్రత ఉంటుంది. ఇక వారి కుటుంబం జోలికి ప్రతిపక్ష నేతలెవరైనా వస్తే వారిని చీల్చి చెండాడేందుకు బిఆర్ఎస్‌ నేతలందరూ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. అయినా సిఎం కేసీఆర్‌ మనుమడు వేధింపులు ఎదుర్కొంటున్నాడంటే నమ్మగలమా? కానీ నిజం!

 సిఎం కేసీఆర్‌కి వరుసకి మనుమడైన రేగులపాటు రితేష్ రావు, తనని పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతకీ రితేష్ రావు ఎవరంటే కేసీఆర్‌ అన్న కూతురు రేగులపాటి రమ్యారావు కొడుకు. అంటే కేసీఆర్‌కి మనుమడు వరుసవుతాడన్న మాట!

అయితే వారి కుటుంబం బిఆర్ఎస్‌లో లేదు... కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆమె కాంగ్రెస్‌ మహిళానేత కాగా రితేష్ రావు ఎన్ఎస్‌యుఐ విద్యార్ధి సంఘానికి నాయకుడు. చాలా కాలంగా రెండు కుటుంబాల మద్య సత్సంబంధాలు లేవు. పైగా ఆమె కాంగ్రెస్‌లో, ఆమె కుమారుడు రితేష్ రావు ఎన్ఎస్‌యుఐలో ఉన్నందున కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలలు, విద్యార్ధుల సమస్యలపై వారు పోరాడుతుంటారు.

రెండు రోజుల క్రితం నార్సింగి వద్ద గల శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్ధి సాత్విక్ , కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక తరగతి గదిలోనే ఫ్యానుకి ఉరివేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ఎన్ఎస్‌యుఐ నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. విద్యార్థులని బలిగొంటున్న శ్రీ చైతన్య కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఎన్ఎస్‌యుఐ, రితేష్ రావు డిమాండ్‌ చేస్తున్నారు. 

కనుక పోలీసులు ముందుగానే అతనిని గృహ నిర్బందం చేసి బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకొన్నారు. ఈరోజు తన పుట్టినరోజని, ఉదయం గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకొందామనుకొంటే, తెల్లవారుజామునే పోలీసులు తన ఇంట్లో జొరబడి నిర్బందించారని రితేష్ రావు ఆరోపిస్తున్నారు. సీఐ, ఎస్పీ ఎవరికి ఫోన్‌ చేస్తున్నా ఎవరూ తన కాల్ కట్ చేస్తున్నారని రితేష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు, 

పోలీసులు అర్దరాత్రి తలుపులు బాదుతూ తమకి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నారని, మేమేమైనా తీవ్రవాదులమా లేక మావోయిస్టులమా? పోలీసులు మమ్మల్ని ఇంతగా ఎందుకు వేధిస్తున్నారని రితేష్ రావు, అతని తల్లి రమ్యారావు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ నిరంకుశ పాలనకి ఇదే తాజా నిదర్శనమని అన్నారు.