బిజెపి నేతలు ఎవరు పేరు చెపితే వారిని సీబీఐ అరెస్ట్ చేస్తుందా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో, ఆ కేసులో నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితని త్వరలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారంటూ బిజెపి నేత చేసిన సంచలన వ్యాఖ్యలపై       బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “త్వరలో నన్ను సీబీఐ అరెస్ట్ చేస్తుందని రాష్ట్రంలో బిజెపి నేతలు పదేపదే చెపుతున్నారు. అంటే బిజెపి నేతలు ఎవరిని అరెస్ట్ చేయమని చెపితే వారిని సీబీఐ అరెస్ట్ చేస్తుందా? మరి అలాంటప్పుడు సీబీఐ ఎందుకు? బిజెపి నేతలే చాలు కదా?

కేంద్ర ప్రభుత్వ విధానాలని, ప్రధాని నరేంద్రమోడీ వైఫల్యాలని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైకి దర్యాప్తు సంస్థలని ఉసిగొల్పుతూ ప్రధాని నరేంద్రమోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అదే... ఆదానీ అక్రమాలు, అడ్డుగోలు దందాలపై దర్యాప్తుకు ఆదేశించగలరా? సీబీఐకి దర్యాప్తు చేసే ధైర్యం ఉందా?” అని ప్రశ్నించారు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారత్‌ జాగృతి అధ్వర్యంలో పార్లమెంట్ సీట్లలో మహిళా రిజర్వేషన్ల కోసం దీక్ష నిర్వహిస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. త్వరలో జరుగబోయే పార్లమెంట్ సమావేశాలలోనే ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించాలని తాము డిమాండ్‌ చేస్తామని కల్వకుంట్ల కవిత చెప్పారు.