ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మధ్యాహ్నం 2 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం నాగాలాండ్, త్రిపురలో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మేఘాలయాలో మాత్రం సంగ్మా నేతృత్వంలోని ఎన్‌సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడు రాష్ట్రాలలో 60 చొప్పున శాసనసభ స్థానాలున్నందున ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం 31 సీట్లు సాధించాల్సి ఉంటుంది.
త్రిపురలో బిజెపి 6 స్థానాలలో విజయం సాధించి మరో 26 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే 32 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టబోతోందని భావించవచ్చు. త్రిపురలో కాంగ్రెస్-వామపక్షాల కూటమి 5 సీట్లు గెలుచుకొని మరో 12 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకి చాలా దూరంలో ఉండిపోయిన్నట్లు అర్దం అవుతోంది.
నాగాలాండ్‌లో బిజెపి-ఎన్‌డిపీపీ కూటమి 25 స్థానాలలో విజయం సాధించి మరో 15 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నందున మొత్తం 40 సీట్లు గెలుచుకొనబోతోంది. కనుక ఈ రెండు రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమనే భావించవచ్చు.
నాగాలాండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్‌పీఎఫ్ 2 సీట్లు గెలుచుకొని మరో 2 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఎన్‌పిపి అనే మరో ప్రాంతీయ పార్టీ ఒక సీటు గెలుచుకొని మరో 2 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
మేఘాలయాలో బిజెపి వెనుకబడిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు కేవలం ఒక్క సీటు గెలుచుకొని మరో 3 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. సిఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ 14 సీట్లు గెలుచుకొని మరో 13 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కనుక ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం మరో 4 సీట్లు అవసరం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలుచుకొని మరో 5 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలుచుకొని 5 స్థానాలలో, ఇతరులు 6 సీట్లు గెలుచుకొని 11 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. కనుక నాగాలాండ్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్న ఎన్‌పీపీ మిగిలిన పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.
నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా శాసనసభలో ఓ మహిళ అడుగుపెట్టబోతోంది. హెకానీ జఖాలు అనే మహిళా అభ్యర్ధి ఎన్‌డీపీపీ తరపున దిమాపూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.