కొడంగల్ నుంచే పోటీ చేస్తా: రేవంత్‌ రెడ్డి

గత ఎన్నికలలో కొడంగల్ నుంచి శాసనసభకి పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోయిన రేవంత్‌ రెడ్డి, ఆ తర్వాత వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికలలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే వచ్చే ఎన్నికలలో తాను మళ్ళీ కొడంగల్ నుంచి శాసనసభకి పోటీ చేస్తానని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం ‘హత్ సే హాత్ జోడో’ పాదయాత్రలో ఈ విషయాన్ని ప్రకటించారు. 

వచ్చే ఎన్నికలలో పొత్తుల గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, “గత ఎన్నికలలో టిడిపితో పొత్తు పెట్టుకొన్నాము కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఒకవేళ వామపక్షాలు కలిసి వస్తే జాతీయస్థాయిలో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమే. ఏపీలో జనసేన బిజెపితో పొత్తులు పెట్టుకొంది. ఇప్పుడు టిడిపితో పొత్తులు పెట్టుకోవాలనుకొంటోంది. కనుక దాంతో పొత్తులు పెట్టుకోబోము. ఈసారి తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాము.” అని చెప్పారు. 

కేసీఆర్‌-మోడీ, బిఆర్ఎస్‌-బిజెపిల గురించి అడిగిన మరో ప్రశ్నకి సమాధానం ఇస్తూ, “అక్కడ ఢిల్లీలో నరేంద్రమోడీని గద్దె దించుతానని కేసీఆర్‌ చెపుకొంటుంటే, ఇక్కడ ఆయనని గద్దె దించుతామని బిజెపి చెప్పుకొంటోంది. నిజానికి నరేంద్రమోడీని మళ్ళీ ప్రధానిగా చేయడానికి, ఇక్కడ కేసీఆర్‌ లేదా ఆయన కుమారుడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేయడానికి ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉంది. బిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ పరస్పరం కత్తులు దూసుకొంటూ ప్రజలని మభ్యపెడుతున్నప్పటికీ, రెండూ పరస్పరం సహకరించుకొంటున్నాయి,” అని అన్నారు. 

“కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు?” అనే విలేఖరుల ప్రశ్నకి “పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారే ముఖ్యమంత్రి అభ్యర్ధి,” అంటూ రేవంత్‌ రెడ్డి ‘స్టాండర్డ్ సమాధానం’ చెప్పి తప్పించుకొన్నారు. 

రేవంత్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతల పాదయాత్రలకి ప్రజల నుంచి ఊహించినదానికంటే మంచి స్పందనే వస్తోంది. అయితే ఈ ప్రజాధారణని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకోగలరా లేదా? అనేది ఎన్నికలొస్తేగానీ తెలియదు.