అత్యాచార ఆరోపణలను ఎదుర్కొని 2019లో భారత్ నుంచి పారిపోయిన వివాదాస్పద నిత్యానంద స్వామి ఈక్వెడార్ సమీపంలో ఓ ద్వీపం కొనుగోలు చేసి దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యుఎస్‌కె) అని పేరు పెట్టుకొని, దానికి తాను ప్రధానిగా ప్రకటించుకొని పరిపాలాన్ చేస్తున్నారు. ఆయన సొంతంగా రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకొని యుఎస్‌కె డాలర్స్ ముద్రించుకొంటున్నారు. అలాగే తనది ఓ ప్రత్యేక దేశమని ప్రకటించుకొని సొంతంగా ఓ జండా ఏర్పాటు చేసుకొని, తమ దేశ పౌరులకి పాస్‌పోర్టులు కూడా జారీ చేస్తున్నారు. కనుక తమది కూడా మిగిలిన దేశాలలాగే పూర్తి సార్వభౌమత్వం కలిగిన దేశమని ప్రకటించుకొన్నారు.
అంతేకాదు... ఇటీవల జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాలకు తమ కైలాస దేశ ప్రతినిధులు ఈఎన్ కుమార్, విజయప్రియ నిత్యానందలని పంపించారు కూడా. ఆ సమావేశాలలో ఆమె ఏమన్నారంటే, “హిందువుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన మొట్టమొదటి సార్వభౌమదేశం యుఎస్‌కె. దీనిని నిత్యానంద పరమశివమ్ స్థాపించి హిందూమత పునరుజ్జీవనం కొరకు కృషి చేస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మా ప్రధానిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వేదిస్తోంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారత ప్రభుత్వం మా ప్రధానికి రక్షణ కల్పించాలని మేము ఐక్యరాజ్యసమితిని కోరుతున్నాం,” అని అన్నారు.