ఖుష్బూ ఖుష్... కానీ ఆమె స్థాయికి అది తక్కువేనేమో?

ప్రముఖ నటి, బిజెపి మహిళా నేత ఖుష్బూని జాతీయ మహిళా కమీషన్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు కేంద్ర ప్రభుత్వం నియామక పత్రం పంపించింది. తననుజాతీయ మహిళా కమీషన్‌ సభ్యురాలిగా నియమించినందుకు ఖుష్బూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా మహిళా హక్కులని కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా తమిళనాడులో మహిళలు తమకి ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నా తనని వచ్చి కలవవచ్చని తన శక్తి, పరిధి మేర వారికి సహాయపడతానని చెప్పారు. 

ఖుష్బూకి రాజకీయాలలో కంటే సినిమాలు, టీవీ షోలలోనే మంచి పేరు, గుర్తింపు లభించింది. ఆమెకి తమిళనాడులో అభిమానులు గుడి కట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాత మొదట డీఎంకె పార్టీలో చేరి అక్కడ ఇమడలేక కాంగ్రెస్‌లోకి దానిలోనూ ఇమడలేక బిజెపిలోకి మారారు. 2021 శాసనసభ ఎన్నికలలో బిజెపి టికెట్‌ ఇచ్చినప్పటికీ పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఏదైనా కీలక పదవి లభిస్తుందని ఖుష్బూ ఆశగా ఎదురుచూస్తుంటే ఇన్నాళ్ళకి ఈ పదవి లభించింది. అయితే ఆమె స్థాయికి, అనుభవానికి ఇది చాలా చిన్న పదవే అని భావించవచ్చు. కనీసం కేంద్ర సహాయమంత్రి పదవి లేదా ఆ స్థాయిలో మరేదైనా పదవి ఇచ్చి ఉండి ఉంటే ఆమెతో పాటు తమిళనాడులో ఆమె అభిమానులు కూడా సంతోషించి ఉండేవారు.