రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ ప్లీనరీ... సోనియా, రాహుల్ డుమ్మా!

నేటి నుంచి మూడు రోజులపాటు ఛత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజు సమావేశానికి మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్‌ యువరాజు రాహుల్ గాంధీ హాజరుకాలేదు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలోనే ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ మూడు రోజుల సమావేశాలకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షులు, ముఖ్య మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కలిపి సుమారు 15 వేల మంది హాజరవుతారు. 

తొలిరోజున సమావేశాలలో పార్టీలో విధానపరమైన, కీలక నిర్ణయాలు తీసుకొనే కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసీ) ఎన్నికపై చర్చ జరిగింది. దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ, పార్టీ అధ్యక్షుడే సిడబ్ల్యూసీ సభ్యులని నామినేట్ చేసేందుకు అధికారం దాఖలు పరుస్తూ ఓ తీర్మానం ఆమోదించారు. 1997లో సిడబ్ల్యూసీ సభ్యులని ఎన్నికల ద్వారా ఎన్నుకొన్నారు. ఆ తర్వాత నుంచి అధ్యక్షుడే వారిని నామినేట్ చేస్తున్నారు. ఇప్పుడూ అదే చేశారు.  

సోనియా గాంధీకి వీరవిధేయుడైన మల్లిఖార్జున ఖర్గేని కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఎన్నికయ్యేలా ఆమె చక్రం తిప్పారు. కనుక ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ సోనియా గాంధీ నిర్ణయాలనే అమలుచేస్తుంటారనేది బహిరంగ రహస్యం. కనుక సోనియా గాంధీ ఈ సమావేశాలకి రాకపోయినా ఆమె ఢిల్లీ నుంచే చక్కబెట్టగలరు. 

ఈ ఏడాదిలో ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్, రాజాస్థాన్‌, తెలంగాణ, కర్ణాటక శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ప్లీనరీలో వాటిని ఏవిదంగా ఎదుర్కొని విజయం సాధించాలనే దానిపై లోతుగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా చేజారిపోతున్న మిత్రపక్షాలని కాపాడుకోవడం గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.