సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు సోమవారం రాత్రి 7.30 గంటలకి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మద్య పూర్తయ్యాయి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీకి, కంటోన్మెంట్ ప్రజలకి ఎంతగానో సేవలు చేసిన సాయన్నకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన అనుచరులు, బంధువులు, దళిత సంఘాలు ప్రభుత్వాన్ని కోరడంతో సిఎస్ శాంతికుమారి అందుకు అంగీకరించారు. కానీ అధికారిక లాంఛనాల కోసం పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఆయన అనుచరులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయన్నకి నివాళులు అర్పించేందుకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, తలసాని, మహమూద్ అలీ, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మైనంపల్లి తదితరులు వచ్చినప్పుడు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మౌనంగా వెళ్ళిపోయారు.
ఆ తర్వాత సాయన్న భౌతికకాయాన్ని ఈస్ట్ మారేడుపల్లిలోని శ్మశానవాటికకి తరలించగా అక్కడా వారు పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సాయన్నకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు చేయడంలేదని పోలీసులని నిలదీశారు. అయితే పోలీస్ అధికారులు వారికి అతికష్టం మీద నచ్చజెప్పి వారిని శాంతింపజేశారు. రాత్రి 7.30 గంటలకి సాయన్న అల్లుడు శరత్ చంద్ర చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు.