తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా చేసిన సోమేష్ కుమార్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నెలరోజుల క్రితమే ఏపీకి వెళ్ళి డ్యూటీకి రిపోర్ట్ చేసినా ఇంతవరకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్ఎస్) తీసుకోవాలనుకొంటున్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పినందునే పోస్టింగ్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన విఆర్ఎస్ తీసుకొనేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపిన్నట్లు తాజా సమాచారం. ఒకటి రెండు రోజులలో ఆయనకి విఆర్ఎస్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
సోమేష్ కుమార్ 1989 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆయనని ఏపీకి కేటాయించగా, ఆయన ట్రిబ్యూనల్‌ని ఆశ్రయించి తెలంగాణలో కొనసాగారు. సిఎస్‌గా అత్యంత సమర్ధంగా బాధ్యతలు నిర్వహించి సిఎం కేసీఆర్ మెప్పు పొందారు. కనుక విఆర్ఎస్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ తిరిగివచ్చిన తర్వాత సిఎం కేసీఆర్ ఆయనని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.