సోమేష్ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ?

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన సోమేష్ కుమార్‌ హైకోర్టు తీర్పు శిరసావహిస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకొని ఆంధ్రాకి వెళ్ళి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన జనవరి 12వ తేదీన ఉద్యోగంలో చేరుతున్నట్లు రిపోర్ట్ చేసినా ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. కనుక ఆయన అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనుకొన్నందునే ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం.

తెలంగాణలో అత్యున్నత పదవి భాద్యతలు నిర్వర్తించిన ఆయన ఏపీలో అంతకంటే చిన్న పదవిలో పనిచేయవలసి రావడం, ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరు వలన అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుండటం దృష్టిలో ఉంచుకొని ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకే మొగ్గు చూపిన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకి దరఖాస్తు చేసుకొన్నట్లు తాజా సమాచారం. పదవీ విరమణ చేసి వస్తే సిఎం కేసీఆర్‌ ఆయనకి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది.