
ఆ మద్యన బీబీసీ న్యూస్ ఛానల్ ప్రధాని నరేంద్రమోడీపై “ఇండియా ది మోడీ క్వశ్చన్” పేరుతో రెండు భాగాల డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్ల గురించి దానిలో చూపారు. దానిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధానమంత్రి రిషి శునాక్ క్షమాపణలు చెప్పుకొన్నారు. ప్రతీ చర్యకి ప్రతిచర్య ఉంటుందనే న్యూటన్ సిద్దాంతం ప్రకారం మోడీ ప్రతిష్టని దెబ్బతీసే విదంగా ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేసినందుకు, ఢిల్లీలో బీబీసీ కార్యాలయాపై ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం దాడులు చేశారు. అయితే అవి దాడులు, సోదాలు కావని కేవలం సర్వే మాత్రమే అని వారు సర్దిచెప్పుకొన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ కలిగిన మీడియా సంస్థ బీబీసీపై దాడులు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ కూడా ఈ దాడులపై స్పందిస్తూ, “బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం కాగానే భారత్లో దాని కార్యాలయంపై ఐటి అధికారులు దాడులు చేసి ఐటి సర్వే నిర్వహించారు. ఐటి దాడుల తర్వాత జీవీకె సంస్థ నవీ ముంబై విమానాశ్రయ నిర్వహణని వాదులుకొని ఆదానీ సంస్థకి ఇచ్చేసింది. త్వరలో ఎన్నికలు జరుగబోతుండటంతో ప్రతిపక్ష నేతలు, వారితో సంబంధాలున్నవారి ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి దాడులు జరుగుతున్నాయి. ఈవిదంగా ఐటి దాడులు చేయిస్తూ బిజెపి తన ప్రత్యర్దులని భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోంది,” అని ట్వీట్ చేశారు.