ఒకరు ప్రగతి భవన్‌.. మరొకరు సచివాలయం డోమ్‌లు కూల్చేస్తారట!

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మొన్న ములుగు జిల్లాలో ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్ర ప్రారంభిస్తూ “పేద ప్రజలకి ప్రవేశం లేని ప్రగతి భవన్‌ ఎందుకు? డైనమేట్స్ పెట్టి పేల్చేయాలి,” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై సొంత పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రగతి భవన్‌ గేట్లు బద్దలు కొడతామని సవరించుకొన్నారు.అయినా విమర్శలు ఆగకపోవడంతో ఈసారి ప్రగతి భవన్‌ పేరు మార్చి ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగిస్తామని అన్నారు. 

రేవంత్‌ రెడ్డి ప్రగతి భవన్‌ కూల్చివేయలంటుంటే, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈరోజు హైదరాబాద్‌, బోయిన్‌పల్లిలో మాట్లాడుతూ, “ఓవైసీల కళ్ళలో ఆనందం చూడటం కోసమే సిఎం కేసీఆర్‌ సచివాలయంపై డోమ్స్ (గుమ్మటాలు) ఏర్పాటుచేశారు. అందుకే అసదుద్దీన్ ఓవైసీ సిఎం కేసీఆర్‌ సచివాలయాన్ని తాజ్ మహల్ కంటే అందంగా కట్టారని మెచ్చుకొన్నారు. అదేదో సినిమాలో బావ కళ్ళలో ఆనందం చూడటం కోసమే చేశానన్నట్లు అసదుద్దీన్ ఓవైసీని సంతోషపెట్టడం కోసమే కేసీఆర్‌ సచివాలయాన్ని తాజ్ మహల్ మోడల్లో నిర్మించారు. తాజ్ మహల్ ఓ సమాధి. సచివాలయం సమాధి కాదు. ఇంటి మీద గుమ్మటాలు పెట్టుకోవడం హిందూ సంస్కృతి కాదు కనుక రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయం మీద ఏర్పాటు చేసిన గుమ్మటాలన్నిటినీ కూల్చివేస్తాము,” అని అన్నారు.