ఒకటోసారి... రెండోసారి... ఆరోసారి.. సీబీఐ లేఖలు

బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణ సిట్ నుంచి సీబీఐకి బదిలీకావడంతో ఆ కేసుకి సంబందించిన ఫైల్స్ వెంటనే అప్పగించాల్సిందిగా సీబీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వరుసగా లేఖలు వ్రాస్తూనే ఉన్నారు. డిసెంబర్‌ 31న తొలిసారిగా లేఖ వ్రాశారు. ఆ తర్వాత జనవరిలో వరుసగా 5,9,11, 26 తేదీలలో లేఖలు వ్రాశారు. కానీ ఈ కేసును చేజార్చుకోవడం ఏమాత్రం ఇష్టపడని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, ఇంతవరకు సీబీఐకి కేసు ఫైల్స్ ఇవ్వలేదు.

బుదవారం హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేయడంతో సీబీఐ అధికారులు మళ్ళీ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ వ్రాసి తక్షణం కేసు ఫైల్స్ అప్పగించాల్సిందిగా కోరారు. ముందుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఈఆర్ వివరాలు ఇవ్వాలని కోరారు.

ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తే సీబీఐ అధికారులు హైకోర్టు లేదా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, కోర్టు ధిక్కారనేరం కింద పరిగణిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు. కనుక సీబీఐ లేఖలపై రాష్ట్ర ప్రభుత్వం నేడో రేపో నిర్ణయం తీసుకోవచ్చు.