ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆడిటర్ బుచ్చిబాబు అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలకపాత్రదారిగా భావిస్తున్న ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ అధికారులు మంగళవారం రాత్రి ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ముందుగా సీబీఐ అధికారులు ఆయనని ఈ కేసు గురించి సుదీర్గంగా ప్రశ్నించారు. తర్వాత అరెస్ట్ చేశారు. ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టి, మరింత లోతుగా ప్రశ్నించేందుకు కస్టడీ కోరనున్నారు. 

ఈ కుంభకోణంలో ఏ-14 నిందితుడిగా పేర్కొనబడుతున్న రామచంద్ర పిళ్లైకి గోరంట్ల బుచ్చిబాబు ఆడిటర్‌గా పనిచేశారు. ఇదే కుంభకోణంలో సీబీఐ విచారణని ఎదుర్కొన్న బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి కూడా బుచ్చిబాబు ఆడిటర్‌గా పనిచేసిన్నట్లు సమాచారం. ఆయన పలుమార్లు ఢిల్లీలో నిందితులతో సమావేశమయ్యి ఈ లిక్కర్ స్కామ్‌ వ్యవహారం గురించి చర్చించారని, వారికి తోడ్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో సీబీఐ అధికారులు హైదరాబాద్‌, దోమలగూడలోని అరవింద్ నగర్‌లోని ఆయన నివాసం శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్‌లో నిందితుల కోసం పనిచేసినందున ఇప్పుడు ఆయన అరెస్టుతో మళ్ళీ రాజకీయ ప్రకంపనాలు మొదలయ్యాయి. సీబీఐ అధికారులు తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోందిప్పుడు.