కేటీఆర్‌కి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పబోతున్నారా?

మళ్ళీ కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి రెండు బలమైన కారణాలు వినిపిస్తున్నాయి. ఆనవాయితీ ప్రకారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సభలో మాట్లాడి, సభ్యులడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. కానీ సిఎం కేసీఆర్‌ నగరంలోనే ఉన్నప్పటికీ అతిముఖ్యమైన ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ చేత సమాధానం చెప్పించారు.

ముఖ్యమంత్రి స్థానంలో కేటీఆర్‌ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు కనుక బడ్జెట్‌ సమావేశాల తర్వాత కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పీఠం మీద కేటీఆర్‌ని కూర్చోబెట్టనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక వారం రోజులలో బడ్జెట్‌ సమావేశాలు ముగించేస్తుండటం, ఫిభ్రవరి 17వ తేదీన కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేయబోతుండటం కూడా ఇందుకేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీని ఇతర రాష్ట్రాలకి విస్తరించేందుకు చురుకుగా పనులు చేస్తున్నారు కనుక వాటితో బిజీ అయిపోతారు. కనుక ముఖ్యమంత్రి బాధ్యతలనీ నిర్వర్తించడం కష్టమవుతుంది. కనుక కేటీఆర్‌కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి కొత్త సచివాలయంలో కూర్చోబెట్టి ఆయన బిఆర్ఎస్‌ నిర్మాణం, విస్తరణ పనులపై దృష్టి పెట్టవచ్చు. ఈ ఊహాగానాలు నిజమో కాదో త్వరలోనే తేలిపోతుంది.