ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సీబీఐకే: హైకోర్టు

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తుని సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు ధర్మాసనం సమర్ధించింది. 

ఆ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు రహస్యంగా ఉంచాల్సిన కేసు సాక్ష్యాధారాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అందజేయడం, ఆయన ప్రెస్‌మీట్‌ ఆ విషయాలన్నీ బయటపెట్టడం సరికాదని కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే సిట్‌కి పోలీస్ బృందం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దర్యాప్తు చేయదనే హైకోర్టు సింగిల్ జడ్జ్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ఈ కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగిస్తూ ఇదివరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు నుంచి ‘సిట్’ని పూర్తిగా తొలగిస్తున్నామని, సిట్‌కి దర్యాప్తుని కూడా రద్దు చేస్తున్నామని హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పు చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం ఆ తీర్పుని సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనంలో పిటిషన్‌ వేసింది. దానిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పుని సమర్ధించింది. కనుక ఈ కేసు దర్యాప్తు మంచి రాజకీయ అస్త్రంగా పనికివస్తుంది కనుక దానిని చేజార్చుకోకూడదని కేసీఆర్‌ భావించిన్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించక తప్పదు. ఒకవేళ ఈ కేసు సీబీఐకి బదిలీ అయితే బిజెపి ప్రతినిధులని జైలుకి పంపిన నలుగురు ఎమ్మెల్యేలు, వారితో పాటు కేసీఆర్‌ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.