కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఢిల్లీలో పోరాటం!

తెలంగాణ ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ గత 5-6 ఏళ్ళుగా కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలని, కేసీఆర్‌ నిరంకుశ వైఖరిని తప్పుపడుతూ తెలంగాణ జనసమితి పార్టీని (టిజెఎస్‌) స్థాపించి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సోమవారం దేశరాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద టిజెఎస్‌ అధ్వర్యంలో 150 మందితో కలిసి గంటసేపు మౌనదీక్ష చేయబోతున్నారు. కృష్ణానదీ జలాల సమస్య పరిష్కరించాలని, విభజన హామీల అమలుచేయాలని కోరుతూ దీక్ష చేయబోతున్నారు. మంగళవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో సదస్సు నిర్వహించనున్నారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివిద రంగాలలో ఏవిదంగా నష్టపోతోందో, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతుండటం, ముఖ్యంగా విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్త వైఖరి, ఏపీతో కృష్ణా జల వివాదాలు తదితర అంశాలపై ఆయా రంగాలలో మేధావులు సదస్సులో మాట్లాడతారు.

రెండు తెలుగు రాష్ట్రాల కోసం ఢిల్లీలో చేస్తున్న తమ పోరాటానికి తెలుగు ప్రజలందరూ సంఘీభావం తెలపాలని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయి కనుక వివిద రాష్ట్రాల నుంచి వివిద పార్టీలు ఢిల్లీకి చేరుకొని తమ రాష్ట్రాలకి సంబందించిన సమస్యల పరిష్కారం కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తుంటాయి. కనున ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో టిజెఎస్‌ కూడా ఢిల్లీ ధర్నా చేయడం పెద్ద విశేషం కాదు. కానీ తెలంగాణ మోడల్ అభివృద్ధి అంటూ సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్న తరుణంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఢిల్లీలో సదస్సు నిర్వహించి కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలు సరికావని తెలియజెప్పాలనుకోవడం రాజకీయమే అనుకోవాలేమో?