యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కొండ దిగువన గల పాత బస్టాండ్ స్థానంలో ఆధునిక సౌకర్యాలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో బస్టాండ్ నిర్మిస్తోంది. దీని నిర్మాణపనులు పూర్తి కావచ్చాయి. మరో వారం రోజులలోగా దీని ప్రారంభోత్సవం జరుగనుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు, 5 ఎకరాల స్థలం కేటాయించింది. దానిలో రూ.5 కోట్లు ఖర్చు చేసి 8,600 చదరపు గజాల విస్తీర్ణంలో బస్ స్టేషన్ నిర్మించింది. మిగిలిన కోటి రూపాయలతో బస్టాండ్ చుట్టూ ప్రహారీ, పచ్చదనం, ఇతర సౌకర్యాల కల్పనకి ఖర్చుచేయబోతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ డీఈ విష్ణు చెప్పారు. ఫిభ్రవరి 1వ తేదీన కొత్త బస్ స్టేషన్ ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు పూర్తి చేస్తున్నామని విష్ణు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని సుమారు రూ.600 కోట్లతో సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం చేసినప్పటి నుంచి స్వామివారిని దర్శించుకొని, ఆలయశోభ తిలకించేందుకు ప్రతీరోజూ వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. కొండపై సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు దిగువన శిధిలావస్థలో ఉన్న బస్ స్టేషన్‌ని కూడా పునర్నిర్మించాలని సిఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆరు కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు.