పార్టీలో కుమ్ములాటలు సాగుతుంటే పాదయాత్రలు చేసి ఏం ప్రయోజనం?

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జనవరి 26 నుంచి ఆరు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నారు. భద్రాచలం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి జూన్ 2న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభతో ముగించాలని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్రకి సంఘీభావం తెలుపుతూ అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ నేతలు ‘హాత్ సే హాత్ జోడో’ (చేతులు కలిపి) అనే పేరుతో కనీసం 2 నెలలు పాదయాత్రలు చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం సూచించగా, రేవంత్‌ రెడ్డి 6 నెలలు పాదయాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన నియోజకవర్గాల గుండా పాదయాత్ర చేయాలని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. 

అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని, ఆయన ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిసున్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ దూకుడు పెరిగిన మాట వాస్తవమే కానీ పార్టీలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక కాంగ్రెస్‌ నేతలని ఆకర్షించేందుకు బిజెపి కాసుకుకూర్చోంది. కనుక రేవంత్‌ రెడ్డి ముందు పార్టీలో ఇటువంటి అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకుండా పాదయాత్ర చేసి ప్రయోజనం ఏమిటి? రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేసి ఏం సాధిస్తున్నారో తెలీదు. అలాగే ఇదీ వృదా ప్రయాసగా మిగిలిపోవచ్చు.