చంద్రబాబు నెల్లూరు పర్యటనలో త్రోక్కిసలాట 8 మంది మృతి

చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. నిన్న సాయంత్రం జిల్లాలోని కందుకూరు పట్టణంలో ఎన్టీఆర్‌ సర్కిల్ వద్ద చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తుండగా త్రొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. పట్టణంలో ఎన్టీఆర్‌ సర్కిల్ వద్దకి చంద్రబాబు నాయుడు వాహనంతో పాటు వేలాదిమంది తరలిరావడంతో అక్కడ కాస్త ఇరుకుగా ఉండే గుండంకట్ట వీధిలో ఆయన కోసం వేచి చూస్తున్న జనం మీద హటాత్తుగా ఒత్తిడి పెరిగింది.

దాంతో ఆ వీధిలో రోడ్డుపక్కన ద్విచక్ర వాహనాలపై నిలబడున్నవారు కిందపడిపోగా వారిపై ఆ వాహనాలు పడటంతో బాధతో కేకలు వేశారు. అదే సమయంలో జనంపై ఒత్తిడి పెరగడంతో కొందరు పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. ఆ త్రొక్కిసలాటలో కిందపడిపోయినవారు జనం కాళ్ళ కింద నలిగి ఊపిరాడక చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోగా మరో ఆరుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.

ఊహించని ఈ ఘటనతో తీవ్ర దిగ్బ్రంతి చెందిన చంద్రబాబు నాయుడు రోడ్ షో నిలిపివేసి, క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలింపజేశారు. తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళి వారిని పరామర్శించి, మృతుల బంధువులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున టిడిపి తరపున నష్టపరిహారం ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.