కారు దిగి ప్రజల వద్దకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఐదు రోజుల శీతాకాలం విడిది కోసం ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకొన్న  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో శ్రీశైలం చేరుకొన్నారు. అక్కడ పూజా కార్యక్రమాలు ముగించుకొన్న తర్వాత సమీపంలో గల శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. 

తమ ఊరికి వచ్చిన రాష్ట్రపతిని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. అయితే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వారు దూరంగా ఉండిపోయి ఆమె కారు వెళుతున్నప్పుడు చేతులు ఊపుతూ పలకరించారు. వారిని చూసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన కాన్వాయ్‌ని ఆపించి కారులో నుంచి దిగి వారి వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరిస్తూ పలకరిస్తూ కొంత దూరం నడుచుకొంటూ వెళ్లారు. సాక్షాత్ భారత్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తమని పలకరించేందుకు కారు దిగి రావడం చూసి ప్రజలు సంతోషంతో ఉప్పొంగిపోతూ ఆమెకి జేజేలు పలికారు. 

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా నిరాడంబర జీవితం గడపడానికే ఇష్టపడతారు. ఆమె రాష్ట్రపతి అభ్యర్ధిగా ఖరారు అయిన తర్వాత ఒడిశాలో మయూర్ భంజ్ జిల్లాలోని తన స్వగ్రామం రాయ్‌రంగాపూర్ వెళ్ళారు. గతంలో ఆమె నిత్యం అక్కడ ఉండే చిన్న శివాలయాన్ని దర్శించుకొనేవారు. కనుక మళ్ళీ దర్శించుకొన్నారు. అందులో విచిత్రమేమీ లేదు. కానీ ఆమె చీపురు పట్టుకొని ఆలయ ప్రాంగణం అంతా ఊడ్చి శుభ్రపరిచారు. అప్పటికే ఆమె ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నికవడం ఖాయమైపోయింది. అయినప్పటికీ ద్రౌపదీ ద్రౌపదీ ముర్ము ఆ ఆలయానికి వెళ్లినప్పుడు గతంలో తాను ఏవిదంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచేవారో అప్పుడూ అలాగే చేయడం ఆమె నిరాడంబరతకి నిదర్శనం. 


ఈరోజు శ్రీశైలంలో నంది సర్కిల్ వద్ద కారు దిగి గ్రామీణ ప్రజలకు అభివాదం చేస్తూ కాలినడకన ముందుకు సాగడం మరో నిదర్శనం. గల్లీ స్థాయి వార్డు మెంబర్ కూడా డాబు దర్పం, అహంభావం ప్రదర్శించే ఈరోజులో దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇంత నిరాడంబరంగా ప్రజల వద్దకి వచ్చి పలకరించడం గొప్ప విషయమే కదా? అందుకే ప్రజలు ఆమెకి జేజేలు పలికారు.   

   

వీడియో ఈనాడు మీడియా సౌజన్యంతో...